‘అరణ్య’ రివ్యూ: పదునైన కథాంశం.. పసలేని కథనం

కమర్షియల్ ఫార్ములాకు మాత్రమే కట్టుబడి ఉండకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసే చాలా కొద్ది మంది నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. హీరో అనే గీత గీసుకుని ఆయన కూర్చోలేదు. పాత్ర నచ్చితే, ఆ పాత్రలో పస ఉంటే కచ్చితంగా చేస్తున్నారు. ‘బాహుబలి’లో భళ్లాలదేవగా నటించి యావత్తు భారత సినీ ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ‘అరణ్య’గా ఒక విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మానవాళికి అడవులు ఎంత ముఖ్యమో, ఆ అరణ్యాలకు ఏనుగులు ఎంత ముఖ్యమో చెప్పేందుకు వచ్చారు. కథ నరేంద్ర భూపతి (రానా దగ్గుబాటి) చిన్నతనం నుంచీ అడవిలోనే పెరుగుతాడు. ఏనుగులతో సావాసం చేస్తాడు. ఆయన తాత జయేంద్ర భూపతి 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేస్తే.. ఆ అడవికి నరేంద్ర భూపతి సంరక్షకుడిగా ఉండిపోతాడు. అడవులు పెరగడానికి కారణం ఏనుగులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతపై మనపై ఉందని చెబుతుంటాడు. లక్షకు పైగా మొక్కలు నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు. అందుకే, నరేంద్ర భూపతిని అక్కడి గిరిజన ప్రజలు అరణ్యగా పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే, అరణ్య సంరక్షకుడిగా ఉన్న అటవీ ప్రాంతంలో భారీ టౌన్‌షిప్ నిర్మించడానికి కేంద్ర అటవీ శాఖా మంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) సన్నాహాలు చేస్తాడు. అడవిని నాశనం చేసి నిర్మించాలనుకున్న ఈ టౌన్‌షిప్‌ను అరణ్య ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే సినిమా. విశ్లేషణ పట్టణీకరణ పేరుతో అడవులను నాశనం చేస్తున్నారనే అంశం ఇప్పటిది కాదు. దీనిపై ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు పోరాటం చేశారు.. చేస్తూనే ఉన్నారు. ఇలా పోరాటం చేసిన ఒక ప్రకృతి ప్రేమికుడి కథే ‘అరణ్య’. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇది ప్రకృతి విలువేంటో చెప్పే పదునైన కథాంశం. కానీ, ఆ పదును కథనంలో కనిపించలేదు. కథను గొప్పగా రాసుకున్న దర్శకుడు ప్రభు సాల్మన్.. కథనంలో మాత్రం పసలేకుండా చేశారు. సాగదీత కథనంతో కాస్త విసిగించారు. ప్రధాన పాత్రలను కూడా బలంగా రాసుకోలేకపోయారు. నక్సలైట్ల ప్రస్తావన, ఒక మహిళా నక్సలైట్‌ను మావటి సింగా (విష్ణు విశాల్) ప్రేమించడం వంటి అంశాలకు దర్శకుడు న్యాయం చేయలేదు. సినిమా నిడివి పెంచడానికే ఈ సన్నివేశాలు అన్నట్టు ఉన్నాయి. రానా, ఏనుగుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. చాలా సాదా సీదాగా అనిపిస్తాయి. ట్విస్టులు ఏమీ లేకుండా చప్పగా సాగే కథనం ఈ సినిమాకు ప్రధాన బలహీనత. ఇక నటీనటుల విషయానికి వస్తే.. ‘అరణ్య’ రానా వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. తనలోని విలక్షణ నటుడిని అరణ్య పాత్రలో ఆవిష్కరించారు రానా. అద్భుతంగా నటించారు. ప్రతి ఫ్రేమ్‌లో రానా కష్టం కనపడుతుంది. చెట్లు, ఏనుగుల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా అరణ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు రానా. ఆఖరికి ఫైట్ల విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుని తన ప్రత్యేకతను చాటుకున్నారు. సినిమాకు మూలస్తంభంగా నిలిచారు. ఇక విష్ణు విశాల్ పాత్ర పరిచయం గొప్పగా ఉన్నా అందులో పసలేదు. శ్రియా పిల్గోంకర్, జోయా హుస్సేన్ పాత్రల పరిస్థితి అంతే. అనంత్ మహదేవన్ విలన్ పాత్రకు న్యాయం చేశారు. రఘుబాబు కామెడీ అంతగా పండలేదు. రానా నటన తరవాత ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం కెమెరా పనితనం. థాయిలాండ్ అడవులను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు సినిమాటోగ్రాఫర్ ఎ.ఆర్. అశోక్ కుమార్. ఆయన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అలాగే, నేపథ్య సంగీతం కూడా సినిమాకు మరో బలం. శంతను మొయిత్రా, జార్జ్ జోసెఫ్ సంయుక్తంగా నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఈ నేపథ్య సంగీతాన్ని తన సౌండ్ డిజైన్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు రసూల్ పూకుట్టి. అయితే, సినిమాకు మరో బలమైన విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. కాకపోతే క్లైమాక్స్‌లో వచ్చే ఏనుగుల సన్నివేశంలో సీజీ వర్క్ అంతగా బాగా లేదు అనిపిస్తుంది. వనమాలి రాసిన మాటలు బాగానే ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ విలువలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. చివరగా.. ‘అరణ్య’.. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తే వచ్చే వినాశనం గురించి చెప్పే ఒక పదునైన కథాంశం. కానీ, పసలేని కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fdOhfB

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts