‘శ్రీకారం’ మూవీ రివ్యూ: మన ఊరి వ్యవ‘సాయం’

ఒక హీరో తన కొడుకుని హీరో చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకుని రైతుని చేయడానికి ఇష్టపడటం లేదు.. వ్యవసాయం అంటే దేశానికి బలం.. సేద్యం చేయడం మనందరి బాధ్యత అంటూ అధునాతన వ్యవసాయానికి ‘శ్రీకారం’ చుట్టాడు హీరో శర్వానంద్. కుటుంబకథా చిత్రాలతో పాటు లవ్ స్టోరీస్‌తో ఆకట్టుకున్న శర్వానంద్.. వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ అనే సోషల్ మెసేజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ‘శ్రీకారం’ ఎలా ఉంది.. కొత్త దర్శకుడు కిషోర్ చెప్పిన ‘ఉమ్మడి వ్యవసాయం’ కాన్సెప్ట్ ఎలా ఉంది? శర్వానంద్ మరో హిట్‌కి ‘శ్రీకారం’ చుట్టారా? అన్నది సమీక్షలో చూద్దాం. కార్తీక్ (శర్వానంద్) హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇతని తండ్రి కేశవులు (రావు రమేష్) చిత్తూరు అనంతరాజపురంలో రైతు. వ్యవసాయం సాగులో భారీగా నష్టపోవడంతో కేశవులు అప్పులపాలౌతాడు. వాటిని తీర్చడం కోసం నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు కార్తీక్. అయితే కార్తీక్‌కి అమెరికా వెళ్లే అవకాశం రావడంతో కేశవులు పొంగిపోతాడు.. అంతలో అమెరికా వెళ్లాల్సిన కార్తీక్ అనూహ్యంగా సొంత ఊరి వచ్చి రైతు అవతారం ఎత్తుతాడు? ఊరి వాళ్లతో కలసి ఉమ్మడి వ్యవసాయం సేద్యం చేస్తాడు? ఈ పరిణామ క్రమంలో కార్తీక్‌కి ఎదురైన ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి వ్యవసాయం చేసి ఎలాంటి అద్భుతాలను సృష్టించాడు అన్నదే? మిగిలిన కథ. పండక్కి ఊరెళ్తాం.. రెండు మూడు రోజులు హ్యాపీగా గడుపుతాం.. మళ్లీ భారంగానే ఇష్టం లేకపోయినా కడుపుతీపి తీరకుండానే అమ్మ, నాన్నల్ని వదిలేసి కడుపుకూటి కోసం పనిచేసే చోటికి పోతుంటాం. అక్కడే ఉండాలన్న ఆశ ఉన్నప్పటికీ ఆకలి బాధలు, బాధ్యతలు ఉండనీయవు.. ఇలాంటి వాటినే చాలా ఎమోషనల్‌గా కళ్లకు కట్టాడు దర్శకుడు కిషోర్ బి. హ్యూమన్ ఎమోషన్స్‌తో అందమైన ఆహ్లాదకరమైన సినిమాకి ‘శ్రీకారం’ చుట్టాడు. చాలా సన్నివేశాలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. మన ఊరిని గుర్తు తెస్తాయి. క్యారెక్టర్లు కూడా చాలా సహజసిద్ధంగా ఉంటాయి. అమ్మ నాన్నల్ని వదిలేసి ఉద్యోగం కోసం ఊరు వెళ్తున్న కొడుకు.. ఊరిలో పంట సరిగా పండకపోవడంతో పట్నం వచ్చి కూలీ పని చేసే రైతు.. పంట రుణాలపై అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారి.. అమ్మ మంచంపై చావుబతుకుల మధ్య ఉన్నా వెళ్లలేక ఫోన్‌లో బంధువులతో పలకరింపులు.. ఇలా ప్రతిపాత్ర ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా కాకుండా ప్రతిపాత్రలో మనం కనిపిస్తుంటాం. మట్టి వాసనలు, స్వచ్ఛమైన పల్లెటూరి పలకరింపులు, పండుగ సందడులు ఇలా ‘శ్రీకారం’లో మన ఊరి జ్ఞాపకాలు చాలానే కనిపిస్తుంటాయి. వ్యవసాయం.. రైతు కష్టం.. సొంత ఊరు.. అక్కడ జనం పాట్లు.. సిటీ నుంచి సొంత ఊరికి వచ్చిన హీరో తిరిగి వ్యవసాయం చేయడం అక్కడ మార్పు తీసుకురావడం.. ఇదంతా తెలిసిన సబ్జెక్టే కావడంతో శ్రీకారం కథ కొత్తగా అనిపించడు. ఫస్టాఫ్ డీసెంట్‌గా సాగిపోతుంది. సెకండాఫ్ వచ్చేసరికి ఎమోషనల్ రైడ్ మొదలౌతుంది. స్లో నెరేషన్ ఈ సినిమాకి లోపం అనే చెప్పాలి. బలమైన సీన్లు, అద్భుతంగా నటించగలిగే పాత్రదారులు ఉండగా.. కథలో కొత్తదనం లేకపోవడం లోటుగా కనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహను దాటి పోకుండా హీరో స్పీచ్‌తో ముగించడం కూడా రొటీన్ అనిపిస్తుంది. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా ఛాయలు శ్రీకారం కనిపిస్తుంటాయి. స్టాఫ్ వేర్ ఉద్యోగిగా.. రైతుగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. సరైన పాత్ర పడాలే కానీ.. పర్ఫెక్షన్ చూపించడంతో తాను దిట్ట అని శర్వానంద్ మరోసారి నిరూపించాడు. పాత్రకు ఎంత వరకూ అవసరమో అంతే చేస్తూ నేచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో జీవించేశాడు. పరిణితి ఉన్న నటనతో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో టక్ చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మంచి స్టైలిష్‌గా కనిపించిన శర్వా.. సెకండాఫ్‌లో లుంగీ కట్టి పొలంలో పనిచేసే రైతుగా వేరియేషన్స్ చూపిస్తూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయాడు. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన తెలివితేటల్ని కంప్యూటర్ కీ బోర్డ్‌పైనే కాకుండా వ్యవసాయ భూమిపై పెడితే ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో తన పాత్ర ద్వారా చూపించగలిగాడు. హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్.. చైత్ర పాత్రలో ఆకట్టుకుంది. హీరో వెనుక పడే తుంటరి పిల్ల పాత్రే అయినప్పటికీ కథలో స్కోప్ ఉంది. శర్వానంద్ పక్కన అందంగా కనిపించింది ప్రియాంకా. శర్వానంద్ తండ్రి పాత్రలో రావు రమేష్ అద్భుత నటనతో మరోసారి మెప్పించారు. మట్టిని నమ్ముకుని ఓడిపోయి.. కుటుంబ బాధ్యతని మోయలేక ఇబ్బంది పడే రైతు పాత్రలో జీవించారు. సీనియర్ నటుడు సాయి కుమార్ ప్రతినాయకుడు ఏకాంబరంగా తన విలక్షణ నటనను చూపించారు. పీచుమిఠాయి అమ్ముకునే వాడు.. ఆ ఊరికి షావుకారుగా ఎలా మారాడన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇక సీనియర్ నటుడు నరేష్ ఎమోషనల్ సీన్స్‌లో జీవించేశాడు. శర్వానంద్ కాంబినేషన్ సీన్స్‌లో నరేష్ తన నటనతో కళ్లు చెమ్మగిల్లేట్టుగా నటించారు. సీనియర్ హీరోయిన్ ఆమని.. హీరో తల్లి పాత్రకి న్యాయం చేసింది. కమెడియన్ సత్య చిత్తూరు యాసతో అదరగొట్టాడు. నవ్వులు పూయించాడు. సప్తగిరి, మురళీశర్మ ఆయా పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం.. బుర్రా సాయి మాధవ్ రాసిన మాటలు. రొటీన్ అనుకునే సీన్స్‌కి తన సంభాషణలతో బలాన్ని ఇచ్చారు బుర్రా సాయి మాధవ్. ✦ పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేంగా.. ✦ పనిని బట్టి పరువు.. పరువుని బట్టి పలకరింపు ✦ ఉద్యోగం వస్తే అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని అనుకున్నాం.. ఉద్యోగం వచ్చాక దాన్ని తప్ప ఎవర్నీ చూసుకోలేకపోతున్నాం.. ✦పండగో చావో వస్తే తప్ప పిల్లలు పట్నం నుంచి ఇంటికి రావడం లేదు.. పెద్దోళ్లు వాటికోసమే ఎదురుచూస్తున్నారు. ✦ తినేవాడు నెత్తి మీద జుట్టంతా ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంత లేరు ✦ ఉమ్మడిగా యుద్ధం చేస్తే రాజ్యాగాలే గెలిచారు.. సేద్యం చేయలేమా?? వంటి డైలాగ్స్ ఆడియన్స్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. ఇక మిక్కీ జె మేయర్ సంగీతం పర్వాలేదు. పెంచలదాస్ రాసి పాడిన ‘వస్తానంటివో’ పాట హైలైట్ అయ్యింది. మొత్తంగా ‘శ్రీకారం’ మంచి సందేశాత్మక మన ఊరి కథ.. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు సిటీ లైఫ్‌కి అలవాటు పడ్డ వాళ్లు చూడాల్సిన సినిమా. కథలో కొత్తదనం లేకపోయినా ఎమోషన్స్‌కి మాత్రం లోటు ఉండదు. ఎక్కడో ఒక చోట ఈ కథకి కనెక్ట్ అవుతారు. Must Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bzD8mR

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts