పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు బాగా పెరుగుతుండటం చూస్తున్నాం. దేశీయ మార్కెట్‌లో 100 రూపాయల మార్క్ కూడా దాటేసి పరుగులు పెడుతున్నాయి ఇంధన ధరలు. దీంతో సామాన్య ప్రజలకు ప్రయాణమే పెను భారంగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజలకు పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో ధరల పెరుగుదలపై ఇటు సామాన్య ప్రజలు, అటు ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నా ఏ మాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో రోజు రోజుకూ ఈ భారం మోయలేక సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్నిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై సామాన్యుడికి అందనంత ఎత్తులో చెట్టెక్కి కూర్చున్న పెట్రోల్ పంపుల ఫొటో జత చేశారు. ''అసలేం జరుగుతోంది? 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్, డీజిల్ ధర.. ఇప్పుడు బంకులలో ఉండే పంపుల వద్ద 100 రూపాయలు దాటేసింది. ఇంధన ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్‌లను వెంటనే రద్దు చేయాలి. ఇలా నిత్యం ధరలు పెరిగిపోవడం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతీ ఒక్కరి తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను'' అని నిఖిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తోంది. ఇదే మాటపై స్టాండ్ అయి ఉంటే అందరు హీరోల సపోర్ట్ మీకు లభిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్‌గా ‘అర్జున్ సురవరం’ సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్.. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’, పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్‌లో '18 పేజెస్' సినిమాలతో బిజీగా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36wbd3Z
No comments:
Post a Comment