చిత్ర పరిశ్రమ అంటే సినిమాలు, పారితోషికాలు, వసూళ్లే కాదు.. నటీనటుల మధ్య మంచి స్నేహం కూడా ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలకు ఒకరంటే ఒకరికి పడదు, ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమాలు చేస్తే వారి మధ్య క్యాట్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయని అంటుంటారు. కానీ అందులో వంద శాతం నిజం లేదు. ఇద్దరు పెద్ద హీరోల మధ్య ఎంతో అనుబంధం, స్నేహం కూడా ఉంటుంది. అందుకు మన మెగాస్టార్ , బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లే నిదర్శనం. అందుకే చిరు తాను నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కీలక పాత్ర చేయాలని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా అమితాబ్ ఓకే చెప్పేశారు. పైగా చిరు ప్రత్యేకంగా అమితాబ్‌ను కలిసి మరీ సినిమాలో నటించమని అడగలేదు. కేవలం ఒక్క మెసేజ్‌తోనే సినిమాకు ఒప్పుకొన్నారు. అంతేకాదు షూటింగ్‌కు వెళ్లి రావడానికి ఫ్లైట్ టికెట్లకు డబ్బు కూడా వద్దన్నారు. అంతెందుకు అమితాబ్ సైరా కోసం ఒక్క రూపాయి పారితోషికం కూడా అడగలేదు. తనకోసం ఇంత చేసిన అమితాబ్ కోసం చిరు ఏదన్నా చేయాలనుకున్నారు. అందుకే ఆయనకు బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చారట. వీటిని చిరు పెద్ద కుమార్తె సుస్మిత డిజైన్ చేశారట. వాటి ఖరీదు కూడా ఎక్కువేనట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అమితాబ్ కేవలం చిరుకే కాదు.. టాలీవుడ్ కింగ్ నాగార్జునకు కూడా మంచి మిత్రుడు. అందుకే నాగ్ నటించిన ‘మనం’ సినిమాలో ఆయన అతిథి పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నారు. అందుకే అమితాబ్, చిరు, నాగార్జున అంటే అన్ని చిత్ర పరిశ్రమల్లోని నటీనటులకు ఎనలేని గౌరవం. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో చిరు.. ఉయ్యాలవాడ పాత్రలో నటించగా.. ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటించారు. అమితాబ్ బచ్చన్.. చిరుకి గురువు పాత్రను పోషించారు. విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్, తమన్నా కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Aq0ZC4
No comments:
Post a Comment