సుప్రీం హీరో కొత్త సినిమాను మొదలుపెట్టారు. కామెడీ, కమర్షియల్ హంగులతో కూడిన చిత్రాలను తెరకెక్కించే మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమాను తేజూ ప్రారంభించారు. సాయిధరమ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా పూజాకార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా స్క్రిప్టును చిత్ర యూనిట్‌కు అందజేశారు. దర్శకుడు మారుతితో తన కొత్త సినిమాను ప్రారంభించినట్లు సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రేక్షకుల ఆశీర్వాదాలు తనకు కావాలని కోరుకున్నారు. ఇది తేజూకి 12వ సినిమా. వరుస ప్లాపుల తరవాత ఈ ఏడాది ఏప్రిల్ 12న వచ్చిన ‘చిత్రలహరి’ సినిమా తేజూకి కాస్త ఊరటనిచ్చింది. ‘చిత్రలహరి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చినా బాక్సాఫీసు వద్ద మాత్రం పెద్దగా కలెక్షన్లను రాబట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తేజూ ఆశలన్నీ ‘ప్రతిరోజూ పండగే’ పైనే ఉన్నాయి. మారుతి కూడా ఈ మధ్య కాలంలో హిట్టు అందుకోలేదు. ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మారుతి స్క్రిప్ట్ అందించిన ‘బ్రాండ్ బాబు’ సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇప్పుడు తేజూతో మారుతి ప్రయోగం చేయబోతున్నారు. అయితే, జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఈ మధ్య అన్నీ హిట్టు సినిమాలే వచ్చాయి. ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలు మంచి విజయాలను నమోదుచేశాయి. కాబట్టి, సాయిధరమ్ తేజ్ ఈసారి హిట్టు కొట్టడం ఖాయంలానే కనిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IDqHbx
No comments:
Post a Comment