మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లుకలుకలు అనే అంశం ఎప్పటికీ చర్చల్లో నిలుస్తూనే ఉంది. '' నిధులు దుర్వినియోగంపై ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తుండటం చూస్తూనే ఉన్నాం. 'మా' సభ్యులపై అవినీతి ఆరోపణలు, కమిటీ మెంబర్స్ మధ్య గొడవలు ఇలా ఎన్నో చూశాం. గతేడాది ఒకే ప్యానల్ నుండి గెలిచిన నరేష్, రాజశేఖర్ మధ్య వివాదాలు తలెత్తడంతో 'మా' వర్గం రెండుగా చీలిపోయింది. అయితే రానురాను 'మా' వివాదాలు పీక్స్‌కి చేరడం, జనాల్లో హాట్ టాపిక్స్ అవుతుండటంతో క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు, , మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలతో ఓ క్రమశిక్షణా సంఘం ఏర్పడింది. 'మా' వ్యవహారాలపై ఓ కన్నేసి పెట్టి రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునేలా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ఏర్పాటైన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి వీరవిహారం చేయడంతో సినీ కార్మికుల జీవితాలు కుదేలయ్యాయి. షూటింగ్స్ బంద్ కావడంతో పని దొరకక చేతిలో చిల్లిగవ్వ లేక బిక్కుబిక్కుమన్నారు సినీ కార్మికులు. ఆ సమయంలో సినీ వర్గాల పెద్ద దిక్కుగా 'సీసీసీ' (కరోనా ఛారిటీ కమిటీ) పేరుతో మరో కమిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకున్నారు చిరు. అటువైపు 'మా' వివాదాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. ఈ పరిస్థితుల నడుమ తాజాగా 'మా' విషయంలో చిరంజీవి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. 'మా' క్రమశిక్షణ సంఘం పదవికి చిరంజీవి రాజీనామా చేశారని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కొవిడ్ ప్రభావం నుంచి బయట పడుతుండటం, పైగా 'మా' తదుపరి ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదేమైనా చిరంజీవి లాంటి ముఖ్యమైన వ్యక్తి ఈ పదవి నుంచి తప్పుకుంటే మాత్రం 'మా'ను గాడిలో పెట్టేవారు కరువే మరి!. చూడాలి.. తాజాగా వినిపిస్తున్న ఈ వార్తలపై చిరంజీవి టీమ్ గానీ, 'మా' గానీ ఎలా స్పందిస్తుందనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mxKOtN
No comments:
Post a Comment