Allu Arjun Birth Day: మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ.. స్టైలిష్‌గా అట్రాక్ట్ చేస్తూనే ఐకాన్ అయ్యారిలా!!

మెగా కాపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు అల్లు అర్జున్. నేడు (ఏప్రిల్ 8) సందర్భంగా ఆయన జర్నీ విశేషాలను ఓ సారి గుర్తు చేసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, బడా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా 2003 సంవత్సరంలో 'గంగోత్రి' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్.. తొలి సినిమాతోనే విజయం అందుకున్నారు. ఆ తర్వాత కూడా చేస్తున్న ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ ముందుకెళ్లిన ఆయన.. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. బాలనటుడిగా 1985 లోనే విజేత, 1986లో స్వాతిముత్యం సినిమాల్లో కనిపించిన ఆయన, ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన 'డాడీ' సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై తనదైన నటన, డాన్సులతో ఆకర్షించి స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. యమ అట్రాక్టివ్ లుక్‌లో లేడీ ఫ్యాన్స్‌ని బుట్టలో వేసుకోవడంలోనూ, యువత పులకరించి పోయేలా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడంలోనూ, అలాగే మాస్ డైలాగ్స్ చెబుతూ థియేటర్స్‌లో ఈలలు వేయించడంలోనూ ఫుల్ సక్సెస్ అయ్యారు బన్నీ. సుకుమార్ రూపొందించిన 'ఆర్య' సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించి రెండో సినిమాతోనే స్టార్ స్టేటస్ పట్టేశాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో నటనకు నంది అవార్డు లభించింది. ఆ వెంటనే 'బన్నీ, హ్యాపీ, దేశముదురు'' లాంటి వరుస హిట్స్ పట్టేసి తెలుగు యువత మనసు దోచుకున్నారు. 'గంగోత్రి'లో అమాయక చక్రవర్తిగా కనిపించిన బన్నీ 'దేశముదురు' సినిమా దాకా వచ్చేసరికి సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి భేష్ అనిపించుకున్నారు. డైలాగ్‌ డెలివరీతో, డ్యాన్స్‌ స్టెప్పులతో, కొత్త లుక్స్‌తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌ సృష్టించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ వెళ్లిన బన్నీ.. తన స్టైలిష్ పర్‌ఫార్‌మెన్స్‌తో స్టైలిష్ స్టార్‌గా వెలుగొందుతూ ''పరుగు, ఆర్య 2, వరుడు, వేదం, బద్రినాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు'' లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించి మెప్పించారు. 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి రోల్ పోషించి తాను అలాంటి రోల్స్‌లో కూడా సెట్టవ్వగలను అని నిరూపించారు. ఆ తర్వాత ''సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాధం, సరైనోడు'' లాంటి సినిమాలు చేసిన అల్లు అర్జున్.. నిర్మాతకు లాభాల పంట పండించగల సత్తా ఉందని ప్రూవ్ చేస్తూ మరో మెట్టు పైకెక్కారు. ఇక ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా గతేడాది మనముంచుకొచ్చిన 'అల.. వైకుంఠపురములో'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని సంబరాల్లో ముంచెత్తింది. ఫ్యామిలీ డ్రామా, కామెడీ సీన్స్‌ మెండుగా ఉండటంతో పాటు థమన్ బాణీలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అందుకు తోడు అందాల భామ పూజా హెగ్డేతో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ వెండితెరకే అందం తెచ్చాయి. దీంతో 'అల.. వైకుంఠపురములో' మూవీ 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే హై రేంజ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్‌గా వెలుగొందిన అల్లు అర్జున్‌ని ఇప్పుడు ఐకాన్ స్టార్ చేశారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'పుష్ప' నుంచి పుష్పరాజ్‌ని పరిచయం చేస్తూ వీడియో వదిలిన సుక్కు.. హ్యాపీ బర్త్ డే ఐకాన్ స్టార్ అంటూ విష్ చేయడం విశేషం. సో.. ఈ ఐకాన్ స్టార్ ఇంకా ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించాలని కోరుకుంటూ మీ మా 'సమయం తెలుగు' తరఫున అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s1FzDT

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts