మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ RRR. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్ ఇటీవల ప్రకటించింది. RRR టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించడంతో ఇటు చరణ్, తారక్ ఫ్యాన్స్‌తో పాటు అటు రాజమౌళి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆనందంగా వ్యక్తం చేశారు. అయితే, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాత్రం రాజమౌళిపై అసహనం వ్యక్తం చేశారు. బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేయడానికి కారణం ‘మైదాన్’ సినిమా. ఫుట్ బాల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి బోనీ కపూర్ ఒక నిర్మాత. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అందుకే, బాక్సాఫీసు వద్ద RRR-మైదాన్ క్లాష్‌పై బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది అన్యాయమని అన్నారు. దీంతో, ఈ రెండు సినిమాల క్లాష్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే బాలీవుడ్ తీవ్రంగా నష్టపోయిందని.. ఈ క్లాష్ వల్ల ఏ సినిమాకు న్యాయం జరగదని కొంత మంది వాదిస్తే.. ‘మైదాన్’ ఒక క్లాసిక్ మూవీ అని దానికి వచ్చే నష్టం ఏమీ లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఈ వివాదంపై RRR నిర్మాత వి.వి.వి.దానయ్య స్పందించారు. ఓ ఇంగ్లిష్ వార్తా పత్రికతో మాట్లాడిన దానయ్య.. ఈ విడుదల తేదీ డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పలుమార్లు చర్చలు జరిగిన తరవాతే ఈ విడుదల తేదీని ఖరారు చేశామన్నారు. RRR, మైదాన్ సినిమాల మధ్య ఈ క్లాష్ కావాలని చేసింది కాదన్నారు. కాబట్టి, ఈ విషయంలో RRR టీమ్‌ను నిందించడం సరికాదని సూచించారు. మరి, ఈ క్లాష్ ఉంటుందా? లేదంటే బోనీ కపూర్ వెనక్కి తగ్గి ‘మైదాన్’ విడుదల తేదీ మారుస్తారా? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pzLHCY
No comments:
Post a Comment