‘ప్రస్థానం’తో నటుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సందీప్ కిషన్ ఆ తరవాత సోలో హీరోగా మారారు. తెలుగు, తమిళ భాషల్లో వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక స్ట్రాంగ్ కమర్షియల్ హిట్ మాత్రం కొట్టలేకపోయారు. ఈ ఏడాది ‘నిను వీడని నీడను నేనే’ అంటూ వచ్చి ఒక మోస్తరు హిట్ ఇచ్చారు. ఇప్పుడు అంతకు మించి హిట్ కొట్టాలనే కసితో కమర్షియల్ అంశాలతో కూడిన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ కథను ఎంపిక చేసుకున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో మంచి పేరున్న జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా చేశారు. హన్సిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదలవుతోన్న చిత్రమిది. సినిమా మీదున్న కాన్ఫిడెన్స్‌తో నిన్న రాత్రే హైదరాబాద్, కర్నూలు, తెనాలి, రాజమండ్రిలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పాజిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇది నవ్వుతూ, ప్రశాంతంగా చూడదగిన సినిమా అంటున్నారు. పర్ఫెక్ట్ కామెడీ పిక్చర్ అని, సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారని చెబుతున్నారు. సందీప్ కిషన్ తన భుజస్కందాలపై సినిమాను నడిపించారట. అంతేకాదు.. ఏపీలో పొలిటికల్‌గా బాగా పాపులర్ అయిన కోడికత్తి, గ్రామ వాలంటీర్లు, కేఏ పాల్ కామెడీ వంటి సంఘటనలను సినిమాలో బాగా వాడేశారట. ముఖ్యంగా కేఏ పాల్ పాడిన పాట స్టైల్లో నటి సత్య కృష్ణన్ చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. కామెడీతో పాటు సెకండాఫ్‌లో మంచి ట్విస్ట్ కూడా ఉందట. మొత్తంగా చూసుకుంటే రెండు గంటలపాటు వినోదాన్ని పంచే మంచి కమర్షియల్ సినిమా అని చూసినవాళ్లు చెబుతున్నారు. అయితే, ఈ పాజిటివ్ టాక్ మధ్య కొంత నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. కామెడీ ఏమీ కొత్తగా లేదని.. రొటీన్ ఊకదంపుడుతో విసిగించారని అనేవాళ్లు కూడా ఉన్నారు. నటీనటుల పర్ఫార్మెన్సులు బాగానే ఉన్నా.. దర్శకుడు సినిమాలో కొత్తగా ఏమీ చూపించలేదని అంటున్నారు. సినిమా నిడివి తక్కువగా ఉన్నందకు సన్నివేశాలను ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. తమిళంలో నెగిటివ్ రోల్స్‌తో ఆకట్టుకుంటోన్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలోనూ అదరగొట్టారట. తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. ఆ డబ్బింగ్ కూడా చాలా బాగుందని అంటున్నారు. అలాగే, సినిమాలో కోర్టు సన్నివేశం అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు. ఈ సీన్‌లో సందీప్ కిషన్ ఇరగదీశారట. మొత్తంగా సందీప్ కిషన్ సినిమాకు నెగిటివ్ టాక్ కన్నా పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O797Ok
No comments:
Post a Comment