జై భీమ్.. ఆకట్టుకునేఎమోషనల్ కోర్ట్ డ్రామా

మన దేశంలో న్యాయవ్యవస్థ గొప్పది. అందుకే పేదవాడైనా, ధనవంతుడైనా తనకు న్యాయం కావాల్సినప్పుడు కోర్టుల వైపు చూస్తారు. కోర్టు ముందు అంద‌ర‌రూ స‌మాన‌మే. అంద‌రికీ స‌మ న్యాయం ద‌క్కాల‌నేదే మ‌న రాజ్యాంగం మ‌న‌కు క‌ల్పించిన హ‌క్కు. దాన్ని కోర్టులు ప‌రిర‌క్షిస్తున్నాయి. త‌మిళ‌నాడులోని క‌డ‌లూరులో జ‌రిగిన ఓ నిజ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమాయే జై భీమ్‌. జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్య‌, జ్యోతిక నిర్మించారు. థియేటర్స్‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశారు. సినిమా విషయానికి వస్తే ఇదొక కోర్టు డ్రామా. మొట్ట మొద‌టిసారి లాయ‌ర్‌గా క‌నిపించారు. ఈ కోర్టు డ్రామాలో అస‌లు సూర్య ఎలాంటి హీరోయిజాన్ని చూపించాడు? ఈ కోర్టు డ్రామా ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. కథ: సినిమా 1995 బ్యాక్‌డ్రాప్ కాకినాడ‌లో మొద‌ల‌వుతుంది. అక్క‌డున్న జైలు నుంచి కొంద‌రు గిరిజ‌నులు బ‌య‌ట‌కు రాగానే వారిపై త‌ప్పుడు కేసులు బ‌నాయించి త‌ప్పించుకోవ‌డానికి పోలీసులు వాళ్ల‌ని ప‌ట్టుకుపోతారు. అయితే అక్క‌డున్నఒకాయ‌న మాత్రం చెన్నై హైకోర్టులో ప‌నిచేసే లాయ‌ర్ చంద్రు(సూర్య‌) ద‌గ్గ‌ర‌కు వెళ్లి, అత‌ని సాయంతో త‌న కొడుకుపై అక్ర‌మ కేసు బ‌నాయించారంటూ కేసు వేస్తాడు. పోలీసులు అక్ర‌మ కేసు పెట్టారంటూ చంద్రు నిరూపించ‌డంతో పాటు రాష్ట్రంలో ప‌ది రోజుల్లో పోలీసులు 7000 కేసులు బ‌నాయించారంటూ వాదించ‌డంతో కోర్టు చంద్రు వాద‌న‌లో నిజం ఉంద‌ని గ్ర‌హించి అత‌నికి అనుకూలంగా తీర్పు చెబుతుంది. చంద్రు పేద‌లు, కార్మికుల ప‌క్షాన పోరాడుతుంటాడు. ఈ క్ర‌మంలో ఓ ప‌ల్లెటూరులోని అధికార పార్టీ నాయ‌కుడి ఇంట్లో బంగారం దొంగ‌త‌నం చేశాడంటూ పోలీసులు ఊరి బ‌య‌ట ఉండే గిరిజ‌నులు రాజ‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రినీ ఇద్ద‌రినీ అరెస్ట్ చేసి తీసుకెళ‌తారు. ఈ గిరిజ‌నుల‌కు ఉండ‌టానికి ఇళ్లు, రేష‌న్ కార్డులు కూడా ఉండ‌వు. కాయ‌క‌ష్టం చేసుకుంటూ బ‌తుకుతుంటారు. పోలీసులు ఎందుకు దొంగ‌త‌నం చేశారంటూ ముగ్గురుని త‌మ స్టైల్లో విచారిస్తారు. మ‌రుసటిరోజునే ఆ ముగ్గురు జైలు నుంచి పారిపోతారు. ఎంత వెతికినా దొర‌క‌రు. మ‌ణికంఠ‌న్ భార్య సిన‌త‌ల్లి(లిజో జోస్‌)కి ఐదేళ్ల పాప ఉంటుంది. ఇంకా నిండు చూలాలు.. కానీ గిరిజనులు అనే ఒకే కారణంతో ఊరి పెద్ద‌లు సాయం చేయ‌రు. ఏం చేయాలో తెలియ‌న‌ప్పుడు ఆ గ్రామంలో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న మిత్ర‌(ర‌జిషా విజ‌య‌న్‌) సాయంతో లాయ‌ర్ చంద్రుని వ‌చ్చి క‌లుస్తుంది. అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని తెలుసుకున్న చందు ఏం చేశాడు? సిన‌త‌ల్లికి న్యాయం జ‌రుగుతుందా? అస‌లు రాజ‌న్‌, అత‌ని స్నేహితులు ఎక్క‌డికి వెళ‌తారు? ఏమైపోతారు? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సమీక్ష‌: ఇది వ‌ర‌కు ప్ర‌స్తావించిన‌ట్లు ఇదొక కోర్టు డ్రామా.. ఇందులో సూర్య లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించారు. సాధార‌ణంగా అటు మాస్‌,ఇటు క్లాస్‌లో మంచి ఇమేజ్ ఉన్న హీరో సూర్య లాయర్ పాత్ర అన‌గానే ఆ పాత్ర‌కు హీరోయిజం ఉంటుందా? మ‌న హీరో ఎలా ఫైట్స్‌, డాన్సులు చేస్తాడ‌నే భావ‌న కొంద‌రి అభిమానుల‌కు రావ‌చ్చు. అయితే కెరీర్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వ‌స్తున్న సూర్య‌, మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకున్నారు. అస‌లు లాయ‌ర్ ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తాడు అనే కోణంలో త‌న బాడీ లాంగ్వేజ్‌ను చూపించారు. పేద‌ల ప‌క్షాన పోరాడే లాయ‌ర్ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. కోర్టు అన‌గానే పేజీల పేజీల డైలాగులు లేకుండా అస‌లు కోర్టు ప్రోసీడింగ్స్ ఎలా జ‌రుగుతాయో అలా సాగేలా ఉండే సినిమాలో లాయ‌ర్ పాత్ర‌. నిజానికి ఇది క‌డ‌లూరులోని జరిగిన లాక‌ప్ డెత్‌లో పోలీసుల‌కు వ్య‌తిరేకంగా కేసు వేసి బాధితుల‌కు న్యాయం చేసిన లాయ‌ర్ చంద్రు పాత్ర‌. ఆ లాయ‌ర్ వ్య‌క్తిత్వాన్ని సూర్య త‌న న‌ట‌న‌తో చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. లిజో జోస్ గిరిజన యువతిగా పెర్ఫామెన్స్ ఇరగదీసింది. ఈ సినిమాలో మెయిన్ హీరో ఆమె అని చెప్పాలి. సినిమాలో ఎమోషనల్ పార్ట్ అంతా ఆమె కారణంగానే జనరేట్ అవుతుంది. ఆమె పాత్రను అందంగా చక్కగా, హుందాగా పోషించింది. ఇక రాజన్ పాత్రలో కాసేపే కనిపించినా మణికంఠన్ కూడా చక్కగా చేశాడు. ఇక ఐజీ పాత్రలో ప్రకాశ్ రాజ్, ప్రభుత్వ ఏజీగా రావు రమేశ్, డీజీపీగా జయప్రకాశ్ ఇలా అందరూ వారి పాత్రల్లో జీవించారు. ఇలాంటి ఎమోషనల్ డ్రామాను కథను నమ్మి ర్మించ‌డ‌మే గొప్ప విష‌యం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న స‌మ‌యంలో క‌మ‌ర్షియ‌ల్ విలువలు అని చూడ‌కుండా సూర్య ఈ సినిమాను త‌న భార్య జ్యోతిక‌తో క‌లిసి నిర్మించినందుకు ఆయ‌న్ని అభినందించాలి. ఫ‌స్టాఫ్‌లో తొలి అర‌గంట గిరిజ‌నులు వారి క‌ష్టాలు చుట్టూనే సినిమా ఉంటుంది. త‌ర్వాత హీరో ఎంట్రీ ఉంటుందంటే సినిమా ఏ పంథాలో ముందుకు సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. క‌థకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక రాజ‌న్ కేసును హీరో డీల్ చేసేట‌ప్పుడు అస‌లు చేయ‌ని త‌ప్పును ఒప్పుకోమ‌ని పోలీసులు వారిని చిత్ర హింస‌లు పెట్టారు? వారితో పాటు వారింటి మ‌హిళ‌ల‌ను పోలీసులు ఎలా ఇబ్బందులు పెట్టార‌నేది చూపిస్తారు. ఆ స‌న్నివేశాల‌ను ప్రేక్ష‌కుల‌కు క‌దిలిస్తాయి. ఇక సెకండాఫ్‌లో పోలీసులు దొంగ‌త‌నం చేసినవాళ్లు త‌ప్పించుకుని పోయారు. క‌న‌ప‌డటం లేదు. అని పెట్టిన కేసుని లాయ‌ర్ సూర్య ఎంత తెలివిగా డీల్ చేసుకుంటూ వెళ్లాడ‌నేదే ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యం. ఆ సాక్ష్యాలు లేక‌పోతే కేసు చెల్ల‌దు. అలాంటి సాక్ష్యాల‌ను సూర్య ఎలా సంపాదించాడు. డిస్మ‌స్ కావాల్సిన కేసుని ఎలా గెలిపించాడు? అనే అంశాల‌ను స్టెప్ బై స్టెప్ ఆస‌క్తిక‌రంగా ముందుకు న‌డిపారు ద‌ర్శ‌కుడు. సినిమాను ఎమోష‌న‌ల్ కోణంలో, ఆలోచింప చేసేలా జ్ఞాన‌వేల్ ఆస‌క్తికరంగా ముందుకు న‌డిపారు. అలాగే సెకండాఫ్ ప్రీ క్లైమాక్ నుంచి కథలో మరింత ఆసక్తి పెరిగేలా పోలీస్ ఆఫీస‌ర్ ప్ర‌కాశ్ రాజ్ పాత్ర‌ను, సూర్య పాత్ర‌కు ఢీ అంటే ఢీ అనేలా ఉండే ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ పాత్ర‌లో రావు ర‌మేశ్ పాత్రలు మ‌న‌కు క‌నిపిస్తాయి. అస‌లు రాజ‌న్ ఏమ‌య్యాడు? అనే విష‌యం ప్రేక్ష‌కుడికి తెలిసిన‌ప్పుడు మ‌న‌సులో తెలియ‌ని బాధ క‌లుగుతుంది. నిజంగా ఇలా జ‌రిగిందా? జ‌రుగుతాయా? అని కూడా అనిపించి వేద‌న‌గా అనిపిస్తుంది. దర్శ‌కుడు జ్ఞాన‌వేల్ నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన స‌న్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. అలాగే తెలియ‌ని ఓ హీరోయిజం క‌థ‌లో ఒకానొక ద‌శ‌లో మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. రాజ‌న్ భార్య‌ను పోలీసులు ఇబ్బంది పెట్టి, కేసు వాప‌సు తీసుకోవాల‌ని ఆమె కూతుర్ని స్టేష‌న్‌కు ఎత్తుకొచ్చిన‌ప్పుడు అక్క‌డకు డీఐజీ ఫోన్ చేసి బెదిరించ‌డం.. ఆమెను ఇంటి ద‌గ్గ‌ర‌కు జీపులో దిగ‌బెట్ట‌మంటే ఆమె విన‌కుండా బ‌స్ ఎక్కుతుంది. దాంతో పోలీసులు పోలీస్ స్టేష‌న్ నుంచి సిన‌త‌ల్లిని ప్రాధేయ‌ప‌డుతూ ఆమె ఇంటి వ‌ర‌కు రావ‌డం.. పోలీస్ డిపార్ట్‌మెంట్ ప‌రువు పోతుంద‌ని తెలిసిన డీజీపీ.. డ‌బ్బులిస్తాం కేసుని వెన‌క్కి తీసుకోవాల‌ని సిన‌త‌ల్లికి చెప్పిన‌ప్పుడు.. ఆ డ‌బ్బులు తీసుకుని నా పిల్ల‌ల్ని పెంచిన‌ప్పుడు రేపు నా పిల్ల‌లు ఈ డ‌బ్బులు ఎక్కడివ‌మ్మా అని అడిగితే నీ అయ్య‌ను చంపినోళ్లు ఇచ్చిందిరా! అని ఎలా చెప్ప‌ను సార్‌.. కేసు ఓడిపోయినా ప‌ర్లేదు. కానీ పోరాడుతాను అని ఆమె చెప్ప‌డ‌.. ఇలా కొన్ని సీన్స్ వ‌ల్ల సినిమాకు హీరోయిజం వ‌చ్చేసింది. ఇక అస‌లు సినిమాకు ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన లాయ‌ర్ చంద్రు గురించి, ఆయ‌న పేద‌ల లాయ‌ర్‌గా ఎలాంటి మంచి ప‌నులు చేశాడ‌నేది చివ‌ర‌లో చెబుతున్న‌ప్పుడు మ‌న‌సుకు తెలియ‌ని ఆనందం వేస్తుంది. సినిమాలో సూర్య లాయ‌ర్‌.. ప్రకాశ్ రాజ్ పోలీస్ వృత్తి ప‌రంగా ఇద్ద‌రి మ‌ధ్య పోటీ ఉన్నా.. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు భావ‌జాలం ప్ర‌కారం గౌర‌వించుకునే తీరు, ఆ సంద‌ర్భంలో వ‌చ్చే డైలాగులు, వాటిని వారు ముందుకు తీసుకెళ్లిన తీరు అద్భుతంగా అనిపిస్తాయి. సినిమా ఓ తరహా రా కోణంలో సాగుతుంది. కథ పరంగా అదే కరెక్ట్ అయినా కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇలాంటి మూవీస్ నచ్చకపోవచ్చు. అలాగే సినిమా నిడివి ఐదు, పది నిమిషాలు ఎడిట్ చేస్తే బావుంటుందనిపించింది. ఎందుకంటే ఫస్టాఫ్ అంతా పోలీస్ స్టేషన్ చుట్టూనే ఎక్కువ కథ తిరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే కదిర్ సినిమాటోగ్రఫీ బావుంది. సీయన్ రోల్డన్ పాటలు తెలుగులో కనెక్ట్ కావు.. అయితే నేపథ్య సంగీతం బావుంది. నటుడిగా, నిర్మాతగా సూర్య చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చివరగా... జై భీమ్.. ఆకట్టుకునే ఎమోషనల్ కోర్ట్ డ్రామా..హీరో సూర్య కొత్త ప్రయత్నానికి జై కొట్టాల్సిందే


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bx5qxD

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts