NTR Birth Anniversary: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్.. తిరుగులేని సినీ, రాజకీయ ప్రస్థానం

మహానటుడు .. ఈ దివంగత స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు తెరపై తిరుగులేని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది కొత్త తారలు సినీ లోకంలో వెలుగులు చిమ్మినా ఎన్టీఆర్ స్థానాన్ని కొంచెం కూడా కదపలేరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. నటనే శ్వాసగా కెమెరా ముందు విలక్షణ పాత్రల్లో నటించి భావితరాలకు చిరస్మరణీయులయ్యారు ఎన్టీఆర్. సినిమానే దేవాలయం.. ప్రేక్షకులే దేవుళ్లు అంటూ సినీ ప్రస్థానం కొనసాగిస్తూ తెలుగు చిత్రసీమకు నెంబర్ వన్ హీరో అయ్యారు. నేడు (మే 28) ఈ మహానటుడి 99వ జయంతి. మే 28వ తేదీ 1923 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించిన నందమూరి తారక రామారావు 1942 మే నెలలో అంటే ఆయన 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. 1947లో పట్టభద్రుడయిన ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగం మానేసి కెమెరా ముందుకొచ్చారు. ఎన్టీఆర్ మొదటిసారి 'మనదేశం' సినిమాతో కెమెరా ముందుకొచ్చారు. ఈ సినిమాలో పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించారు. ఆ తర్వాత 'పల్లెటూరి పిల్ల' సినిమా చేసిన ఆయన.. మద్రాసులో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉంటూ సినీ జీవితాన్ని కొనసాగించారు. అలా పట్టుదలగా పని చేస్తూ తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళు అధిగమించారాయన. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు ఎన్టీఆర్. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలుగుతూ అందాల రాముడిగా, కొంటె కృష్ణుడిగా, ఏడు కొండల వాడిగా ఇలా అన్ని వేషాలు వేసి ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు ఎన్టీఆర్. ఓ సినీ నటుడైనా తెలుగు ప్రజల చేత 'అన్న గారు' అని పిలిపించుకున్నారంటే అది ఆయన గొప్పతనానికి నిదర్శనం. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్నారు ఎన్టీఆర్. నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి నందమూరి తారక రామారావు జీవితాన్ని ఇటీవలే వెండితెరపై ఆవిష్కృతం చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో ఆయన జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు డైరెక్టర్ క్రిష్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ నట వారసత్వం కొనసాగుతూ నందమూరి మార్క్ కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RUwdh7

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts