విక్టరీ ఎంచుకునే కథలు, ఆయన పోషించే పాత్రలు ఈ మధ్య ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. రీమేక్ కథలే అయినా కూడా వాటిని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తున్నాడు. నారప్పతో హిట్ కొట్టిన వెంకీ ఇప్పుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చాడు. ఓటీటీలో వరుసగా రెండో సారి వచ్చిన వెంకటేష్.. ఆడియెన్స్‌ను దృశ్యం 2తో మెప్పించాడా? లేదా? అన్నది చూద్దాం. కథ పోలీస్ ఆఫీసర్ గీత కొడుకు(విక్రమ్) కేసు నుంచి బయటపడ్డ రాం బాబు (వెంకటేష్) ఫ్యామిలీకి మళ్లీ ఆరేళ్ల తరువాత కష్టాలు మొదలవుతాయి. ఈ ఆరేళ్లలో ఊర్లో రాం బాబు చాలా ఎదుగుతాడు. కేబుల్ ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ ఓనర్ వరకు ఎదుగుతాడు. ఎలాగైనా సరే తన వద్ద ఉన్న పాయింట్స్‌తో సినిమా తీయాలని అనుకుంటాడు. ఈ మేరకు రైటర్ వినయ్ చంద్ర (తణికెళ్ల భరణి)సాయం అడుగుతాడు. రాం బాబు ఇలా తన సినిమా పనుల్లో బిజీగా ఉంటాడు. మరో వైపు పాత కేసును తవ్వుతుంటారు పోలీసులు. ఇందుకోసం అండర్ కవర్ ఆపరేషన్ కూడా చేస్తారు. రాం బాబు ఇంట్లో జరిగే విషయాలు, మాట్లాడుకునే సంగతులు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. కానీ శవాన్ని ఎక్కడ పెట్టారో ఇటు కుటుంబ సభ్యులకు కూడా రాం బాబు చెప్పడు. అది తెలియక పోతే పోలీసులు అడుగు ముందుకు వేయలేరు. అయితే పోలీసులు వేసిన ఎత్తులు ఏంటి? రాం బాబు వేసిన పై ఎత్తులు ఏంటి? అసలు శవం పోలీసులకు దొరికిందా? చివరకు రాం బాబు ఏం చేశాడు? సినిమా తీయాలని అంత పట్టు ఎందుకు పట్టాడు? దానికి ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా? చివరకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటన్నదే దృశ్యం 2 సినిమా కథ. నటీనటులు దృశ్యం మొదటి పార్ట్, రెండో పార్ట్‌కు కొన్ని పాత్రలు యాడ్ అయ్యాయి. వాటితోనే కథ మలుపులు తిరుగుతుంది. జనార్థన్ (షఫీ), సరిత (సుజ), సంజయ్ (సత్యం రాజేష్), ఐసీ గౌతమ్ సాహూ (సంపత్) పాత్రలతో ఈ పార్ట్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. తన ఫ్యామిలీ కోసం ప్రతీ క్షణం ఆలోచించే రాంబాబు, నిజాన్ని తనలోనే మోస్తూ బాధపడే తీరు, పోలీసుల అంచనాలకు మించి వేసే ఎత్తులతో రాంబాబు అందరినీ ఆకట్టుకుంటాడు. నిజం ఎప్పుడెప్పుడు బయటపడుతుందా? అని జ్యోతి పాత్రలో మీనా అద్భుతంగా నటించింది. నదియా, నరేష్, సంపత్ రాజ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. అప్పుడప్పుడు కనిపించినా షఫీ, చమ్మక్ చంద్రల పాత్రలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. రైటర్ పాత్రలో నటించిన తణికెళ్ల భరణితో అసలు కథ చెప్పించారు. అలా నటీనటులందరికీ సముచితమైన ప్రాముఖ్యత ఉంది. విశ్లేషణ క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్‌లకు కావాల్సింది ఎమోషన్. చూసే ప్రేక్షకులను అందులో ఎంత వరకు లీనమయ్యేలా చేయగలమన్నదానిపై సినిమా ఆధార పడుతుంది. తెరపై పాత్రలు పడే బాధను చూసే ప్రేక్షకుల పడాలి. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే టెన్షన్ చూసే ప్రేక్షకుల్లోనూ కలగాలి. అలాంటి ఫీలింగ్ కలిగింది దృశ్యం. రాంబాబుగా వెంకటేష్ తన ఫ్యామిలీ కోసం ఎన్ని రకాలు పనులు చేశాడు, న్యాయవ్యవస్థ, చట్టవ్యవస్థలను ముప్పతిప్పలు పెట్టాడు. అలాంటి రాంబాబు మళ్లీ తన ఫ్యామిలీకి కష్టం ఎదురైతే, ఆగిపోయిన ఇన్వెస్టిగేషన్ మళ్లీ మొదలైతే పరిస్థితి ఏంటి? అనే పాయింట్‌తో ఈ సెకండ్ పార్ట్‌ను రాసుకున్నాడు. చట్టం కళ్లు కప్పి ఎక్కువ రోజులు తిరగలేమని, ఒకవేళ పోలీసులకు ఆ శవం దొరికితే తరువాతే జరిగే పరిణామాలు ఏంటి? అనేది రాంబాబు ముందే ఊహిస్తాడు. రాంబాబు మీద కన్నేసి ఉంచామని, అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నామని పోలీసులు అనుకుంటారు. కానీ రాంబాబు మాత్రం జాలీగా తిరుగుతూనే తమ కంటే వంద అడుగుల ముందున్నాడని మాత్రం గ్రహించలేకపోతారు. అలా రాం బాబు ఇచ్చే ట్విస్ట్‌లకు పోలీసులకే కాదు.. చూసే ప్రేక్షకుడికి సైతం మైంబ్ బ్లాక్ అవుతుంది. నిజానికి మనం అతని మీద నిఘా పెట్టలేదు.. అతనే వెయ్యి కళ్ళతో మనల్ని గమనిస్తున్నాడు…క్లాసిక్ క్రిమినల్ అంటూ సంపత్ చెప్పే డైలాగ్‌తో రాంబాబు సామర్థ్యమేంటో అందరికీ అర్థమవుతుంది. తెలివిగా పోలీసులను ట్రాప్‌లోకి ఎలా తీసుకొచ్చాడు.. చివరకు ఎలా బురిడి కొట్టించాడు.. తాను ఎలా తప్పించుకున్నాడు? అనే పాయింట్లను జీతూ జోసెఫ్ అద్భుతంగా రాసుకున్నాడు. ఈ సినిమాకు ఆ కథ, ఇంత గ్రిప్పింగ్‌గా రాసుకున్న కథనమే బలం. రాంబాబు తాగుతూ ఇలా టైం పాస్ చేస్తున్నాడేంటి? అని అందరూ అనుకుంటారు. కానీ దానికి కూడా ఓ ఇంపార్టెన్స్ ఉందని చివర్లో తెలుస్తుంది. అలా ప్రతీ ఒక్క పాయింట్‌ను ఆసక్తిరంగా మలిచాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగానే కథనాన్ని రాసుకున్నాడు. అయితే ఒరిజినల్ సినిమాకు ఈ రీమేక్‌కు కొన్ని మార్పులు చేర్పులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా గుర్తు పట్టలేనంతగానే ఉంటాయి. పద్దతులు, మతాలకు సంబంధించిన చిన్నపాటి మార్పులు మాత్రమే కనిపిస్తాయి. అయితే సినిమా ప్రథమార్థం అలా కాస్త స్లోగా అనిపించినా కూడా.. ద్వితీయార్థం మాత్రం ఆసాంతం కూడా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ఎడిటింగ్ లోపాలు ఎక్కడా కనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మూడ్‌కు తగ్గట్టు ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. చివరగా.. రాంబాబు నిజంగానే క్లాసిక్ క్రిమినల్
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/310ask7
No comments:
Post a Comment