ఆయనలాంటి నాయకుడు కావాలి.. ఆయన లాంటి కథా నాయకుడు కావాలి.. ఆయనలాంటి భర్త కావాలి.. ఆయన లాంటి తండ్రి కావాలి.. ఆయన లాంటి తాత కావాలి.. ఆయనంటే ఓ చరిత్ర, ఆయనంటే ఓ విప్లవం.. ఢిల్లీ కోటల్ని కదిలించిరాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికిన నటసార్వభౌమ ఎన్టీరామారావు జయంతి నేడు (మే 28). ఆ మహానుభావుడ్ని స్మరిస్తూ జోహార్ . తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి.. రాముడు, కృష్ణుడు వేషం వేస్తే నా అన్న ఎన్టీఆర్ మాత్రమే వేయాలి అన్నంతగా.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్ అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఎన్టీఆర్. సుమారు 400 చిత్రాల్లో నటించి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా కళామ్మతల్లికి ముద్దుబిడ్డ అయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయం అనే చెప్పాలి. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం, ఆయన పలుకు ఓ సంచలనం.. ఆయన మాట ఓ తూటా.. ఆయన సందేశమే స్పూర్తి. పురాణ పురుషుల పాత్ర ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించబడ్డ ఎన్టీఆర్.. రాజకీయ నేతగానూ ప్రజలచే కీర్తింపబడ్డారు. ‘ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది. కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి’ అంటూ 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ‘రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్’ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచిచూపించారు. తప్పుడు వాగ్దానాలు.. తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు. అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. ‘పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం’ అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పూనిన ఎన్టీఆర్.. నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’ అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లోనూ.. దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికీ అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులు.. ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. ఇలాంటి నాయకుడు మళ్లీ పుట్టాలని ఆ మహానేత సేవలు మళ్లీ చూరగొనాలని ఆకాంక్షిస్తూ జోహార్ ఎన్టీఆర్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2B9tcAZ
No comments:
Post a Comment